Showing posts with label Daughter. Show all posts
Showing posts with label Daughter. Show all posts

Sunday, October 10, 2010

నామకరణానికి బెలూన్స్

“ఆడపిల్ల పుట్టింది మీకు” అని నర్స్ చెప్పగ్గానే హాస్పిటల్లో అందరు కార్తీక్ ని అభినందించడం మొదలుపెట్టారు. తను అనుకున్నట్లే పాప పుట్టిందని తెలిసి కార్తీక్ ఆనందానికి అసలు హద్దేలేకుండాపోయింది. అందరూ వెళ్లి పాపని చూడవచ్చు అని డాక్టర్ చెప్పగానే ఒక్కరు కూడా హాల్లో కనబడలేదు, అందరు లోపలికి వెళ్లి పాపని చూస్తున్నారు. ఎవరికి వాళ్ళు తమ తమ పనుల్లో లీనమై ఉంటే, ఐశ్వర్య తల్లిదండ్రులు అప్పుడే నామకరణ మహోత్సవానికి సన్నాహాలు చేయడం మొదలుపెట్టారు. తన కూతురు నామకరణం జన్మజన్మలకు అందరు చెప్పుకునేలాగా చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేసాడు కార్తీక్. ఎట్టకేలకు ఒక ఆలోచన కార్తీక్ ను స్పురించింది. నామకరణం చెయ్యాల్సిన సమయం కూడా రానే వచ్చింది.


యుక్తవయస్సు పిల్లలందరు అన్నీ సమకూర్చే పనుల్లో ఉన్నారు. అందరిలో కొంచెం పెద్ద వాడైన అభిరామ్ బెలూన్ పాకెట్లను తీసుకొచ్చాడు. పెద్ద పిల్లలందరూ బెలూన్స్ ఊదడానికి సన్నద్దం అవుతుంటే, కార్తీక్ ఎవ్వరూ కూడా బెలూన్స్ ఊదవద్దు అని వారించాడు. అందరు అదేంటి, ఇదేంటి అని, అసలు బెలూన్స్ ఉంటే ఎంత నిండుగా ఉంటుందని కొందరు, వచ్చిన పిల్లల్ని అదుపులో పెట్టాలంటే కనీసం బెలూన్స్ అన్నా ఉండాలిగా అని ఇంకొందరు ఇల్లంతా అయోమయంగా తయారయ్యింది. ఒక అరగంట రసాబాస తర్వాత, కార్తీక్ నేను ఖచ్చితంగా బెలూన్స్ కట్టిపిస్తాను నన్ను నమ్మండి అని గట్టిగా చెప్పేసరికి, అందరు కొద్దిగా చల్లబడి, ఎవరి పనుల్లోకి వారు వెళ్ళిపోయారు.


కార్తీక్, ఏడెనిమిది మంది యువకులని అభిరామ్ తో సహా దగ్గరికి పిలుచుకొని తను ఆ బెలూన్స్ ని ఎలా కట్టించాలో, వాటన్నింటిని ఎవరు ఊదుతారో, బెలూన్స్ అన్ని కట్టిన తర్వాత పనులేంటో చెప్పడం పూర్తి అవగానే, పక్కనే ఇవన్ని గమనిస్తున్న కార్తీక్ మామగారు, ఇదేంటి బాబూ? ఏదో నామకరణానికి వచ్చిన వారికి భోజనం పెట్టి పంపాలి కానీ ఇదేంటి వింతగా? అనగానే, అభిరామ్ అందుకొని, మామయ్య మీకేం తెలియదు మీరూరుకోండి, అన్నయ్య చెప్పినట్టు చేద్దాం, అందులో తప్పేముంది అని అంటే, కార్తీక్ కి పాపం వాళ్ళ మామగారికి అసలు విషయం చెబుతామని అనుకుంటాడు. మామయ్యా! మీ మనమరాలు గురించి మీకెంత పట్టింపు ఉందో, తండ్రిగా నాకు అంత కంటే ఎక్కువ ఉంది. ఈ నామకరణంలో మిమ్మల్ని ఎవరైనా మాట అంటే నన్నన్నట్టే కదా! ఈ పిల్లలందరు అన్ని బెలూన్స్ ఊదితే వాళ్ళ బుగ్గలు నొప్పిస్తాయి అంతే కాకుండా వాళ్ళు కేవలు బుగ్గలు ఊదుకుంటూనే రోజంతా కూర్చోవాలి వస్తుంది. వాళ్ళు అంతగా కష్టపడితే, సరిగ్గా అవి రెండు గంటలు కూడా ఉండవు, వచ్చిన పిల్లలందరు ఏదోలా పీకేసి ఆడుకుంటారు. దీని కంటే ఎక్కువగా నేను చెప్పేదేమిటంటే, అసలు మన ఊపిరితిత్తులని మనం పూర్తిస్థాయిలో వినియోగించడం లేదు, కేవలం ఇలా బెలూన్స్ ఊదడం వలన గాని, ప్రాణాయామ యోగలాంటి వాటి ద్వారానే సాధ్యం. యోగ చేసేంత సమయం కానీ, ఓపిక గాని చాలా మందికి లేదు. కానీ ఒక బెలూన్ ఊదడానికి కేవలం రెండు నిమిషాలు పడుతుంది అంతే. ఇలా ఊదితే మంచిది అని అందరికి చెబుతాము, ఊదడం, ఊదక పోవడం వాళ్ళ ఇష్టం. నేను కూడా ఎప్పటినుండో రోజుకొకసారైనా బెలూన్ ఊదితే బావుంటుందని అనుకుంటున్నాను కానీ ఆచరించలేక పోతున్నాను. నా కూతురు పుట్టిన సందర్బంగా ఏదో ఒకటి నా జీవితాంతం గుర్తుండేది చెయ్యాలనుకున్నాను, ఇది దానికి సరైన సమయం అని అనుకుంటున్నాను అని చెప్పగానే కార్తీక్ మామగారు రెండు వేయి రూపాయల నోట్లు అభిరామ్ కు ఇచ్చి మంచి క్వాలిటీ బెలూన్స్ ఈ డబ్బులకు ఎన్ని వస్తే అన్ని తీసుకురా అని చెప్పి పంపాడు.


అభిరామ్ హుటాహుటిన వెళ్లి ఇంకో యాభై పాకెట్లు తీసుకొని వచ్చాడు. యువకులందరూ కార్తీక్ చెప్పినట్టుగా, ఫంక్షన్ హాలు గేటు దగ్గర నిలబడి, అందరి చేత రెండేసి బెలూన్స్ ఊదిస్తున్నారు. రెండు బెలూన్స్ ఊదినవారి పేరు ఆ యువకులు ఒక చిట్టిలో రాసి పక్కకే ఉన్న హుండీలో వేస్తున్నారు. దానిపైన బంపర్ డ్రా అని రాసి ఉంది. అదేంటో కార్తీక్ కు తప్ప ఎవరికీ తెలియదు. చాలా మంది పిల్లలున్న వాళ్ళు బెలూన్స్ ఊదుతున్నారు, కొందరు పిల్లలకోసం కొన్ని తీసుకెళ్తున్నారు, ఇంకొందరు అసలు ఊదమంటూ లోపలికి వెళ్తున్నారు. కన్నె పిల్లలు మాత్రం ససేమిరా ఊదమంటూ తప్పించుకుంటున్నారు.

ఎంత మంది ఎన్ని రకాలుగా చెప్పినా కొందరు నడివయస్కులు, ఇదేం చోద్యం అనుకుంటూ లోనికి వెళ్తున్నారు. పేరంటానికి వచ్చిన వాళ్ళని మరీ బలవంతపెట్టడం కూడా బాగుండదని అనుకుని, ఆ యువకులు ఎవరినీ బలవంతం చేయడం లేదు. రాజస్తాన్ ఎడారుల్లో ఒయాసిస్సు లాగ డాక్టర్ శ్రీమన్నారాయణ తన కుటుంబంతో పాటు వచ్చాడు. ఆ యువకులు బెలూన్స్ చేతికిచ్చి ఊదుమంటే తను మెడిసిన్ చేస్తున్న రోజుల్లో వాళ్ళ ప్రొఫెసర్ చెప్పిన విషయం గుర్తుకు వచ్చి, ఈ పాప నామకరణమేమో గాని ఇన్ని వందలమందికి ఊపిరితిత్తులకు సంబంధించిన రోగాలు కొద్ది రోజులు దరిచేరవు, అసలు కన్నె పిల్లల బుగ్గలు బూరెల్లా ఊరడానికి ఇంత కంటే మంచి వ్యాయామం లేదు అని చెప్తుండగా డాక్టర్ మాటలు సరిగ్గా ఒక్క కన్నె పిల్ల చెవిన పడింది. అంతే, ఆ నోటా, ఈ నోటా ఫంక్షన్ హాల్ లో ఉన్న కన్నె పిల్లలందరి చెవుల్లో పడగానే, బెలూన్స్ ఊదదానికి అమ్మాయిలందరూ బారులు తీసారు. అభిరామ్ ఏమో, రెట్టించిన ఉత్సాహంతో డాక్టర్ని తీసుకొని ఒకరిద్దరు ముసలివాళ్ళు, ఒకరిద్దరు నడివయస్కులు ఉన్న దగ్గరికి తీసుకెళ్ళి డాక్టర్ నోటితో ఈ విషయాన్ని గుచ్చి గుచ్చి చెప్పించాడు. ఒక ముసలాయన, ఏరా అభిరామ్! మేము ఇప్పుడే ముసలివాళ్ళమేమి కాలేదు, బెలూన్స్ తీసుకొచ్చి మాతో ఊదించాలని లేదారా? అని అనగానే, హమ్మయ్య చేప గాలానికి పడ్డదని అనుకుంటూ అడిగిన వాళ్ళ దగ్గరికి అడగని వాళ్ళ దగ్గరికి బెలూన్స్ ఇవ్వడం మొదలుపెట్టాడు. డాక్టర్ వచ్చిన వేళావిశేషమేమిటో గాని అరగంటలో ఫంక్షన్ హాల్ మొత్తం రంగురంగుల బెలూన్స్ తో నిండిపోయింది. ప్రతి వయస్సువారికి ఏదో రకంగా ఈ వ్యాయామం ఉపయోగపడుతుండడం వలన కార్తీక్ ని కలిసిన వాళ్ళలో నీ కూతురు నామకరణం కలకాలం గుర్తుంటుంది అని కొందరు, అసలు నా మనమరాలి నామకరణం ఇంతకంటే ఘనంగా చేస్తానని ఇంకొందరు, అసలు బెలూన్స్ ఊది సంవత్సరాలు అయింది మా బుగ్గలు నొప్పి పెడుతుందని కొందరు, ఎవరికీ తోచిన విధంగా వారు పొగుడుతుంటే కార్తీక్, అంత నా కూతురు చేసుకున్న అదృష్టం అని సమాధానమిస్తూ, నామకరణానికి వచ్చిన వాళ్ళందరికి ధన్యవాదాలు చెపుతూ, అభిరామ్ కు మరియు మిగతా యువకులకు, డాక్టర్ కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పి నామకరణం చేసే దగ్గరికి వెళ్ళిపోయాడు.

Monday, April 19, 2010

నా కూతురి పెళ్లి ...!





మిట్ట మధ్యాహ్నం రెండు గంటలవుతుండగా వడి వడిగా లస్సి తాగుదామని ఒక హోటల్ లోకి అడుగుపెట్టాడు లక్ష్మినారాయణ. ఎండ తీవ్రత కన్నా ఎక్కువగా తన కూతురు అలా చెప్పిందేమిటనే  విషయమే అతన్ని లస్సి తాగేలా చేస్తుంది. తనని ఎలా పెంచాను, నా చేతుల్లో పెరిగిన అమ్మాయి ఇలా చేసిందేంటి? అసలు నేనేమన్నా తప్పు చేసానా? తనకు కోరినంత స్వేచ్చ ఇస్తే నాకు ఇచ్చే మర్యాద ఇదా? ఇలా మనసులో ఎన్నెన్నో ప్రశ్నలు అతన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే.. అప్పుడే సర్వర్ వచ్చి ఏం కావాలని అడుగుతుంటే.. ఈ లోకం లో వచ్చి పడ్డాడు లక్ష్మినారాయణ. ఒక లస్సి చాలు అని చెప్పగానే సర్వర్ అక్కడినుండి వెళ్ళిపోయాడు.

మళ్లీ లక్ష్మినారాయణ తన ఆలోచన లోకంలోకి అడుగుపెట్టాడు. అసలు నా పరువు ఏం కావాలి? నా ప్రతిష్ట ఏం కావాలి? అసలు నేను సమాజంలో ఎలా తలెత్తుకునేది? ఈ కాలం పిల్లలు అన్నింట్లో ఇంత ముందుకు పోతున్నారు అని అందరు అంటారే కానీ.. ఇంకా అందరు అలానే వంకరటింకరగా ఆలోచిస్తున్నారు,వక్ర మార్గాలు పడుతున్నారు. పెద్దల మీద గౌరవం రాను రాను మరీ తగ్గిపోతుంది... అసలు ఈ కాలం అబ్బాయిలు ఒక్కడన్నా తల్లిదండ్రుల గురించి ఆలోచిస్తాడాఆలోచిస్తే నా లాంటి తండ్రులకు ఈ లస్సి అవసరాలే ఉండవు. సార్..మీ లస్సి! అని సర్వర్ అనగానే మళ్ళీ ఈ లోకంలోకి వచ్చాడు లక్ష్మినారాయణ.

ఒక్క గుటక లస్సి తాగగానే కొంచెం మనశ్శాంతి దొరికిందిరా రామచంద్ర అని మనసులో అనుకుండగానే తన కళ్ళముందర ఇద్దరు యువకులు కనపడ్డారు. ఇలాంటి వాడెవడో అయ్యుంటాడు నా కూతురికి మాయ మాటలు చెప్పి తన మనసు మార్చి నన్ను ఇంత వేదనకు గురి చేస్తున్నారు అని అనుకుంటుండగానే వాళ్ళు తన వెనకాల ఉన్న బెంచిని ఆక్రమించారు. ఒకడు ఎరుపు చొక్కా ధరిస్తే ఇంకొకడు ఆకు పచ్చ రంగు చొక్కా ధరించాడు. ఇద్దరికిద్దరూ పనికిమాలిన వెదవల్లా ఉన్నారని మనసులో అనుకుంటూ కొద్దిక్కొద్దిగా లస్సి తాగుతున్నాడు. ఎరుపు చొక్కా యువకుని మొబైల్ ఫోన్ మోగగానే ఉలిక్కి పడి లోలోపల అందరిని తిట్టుకుంటున్నాడు. అసలే భయం భయం తో ఉన్న లక్ష్మినారాయణకి ప్రతీది వణుకుపుట్టిస్తుంది... ఆఖరుకు సెల్ ఫోన్ మోగిన చప్పుడు కూడా...

హలో, ఆహ్ అవునా?, దానికేమన్న పిచ్చా?, ఏం రోగమో?, సర్లే నేను వెళ్తానులే పెద్దమ్మ దగ్గరికి అని ఆ యువకుడు ఫోన్ పెట్టేసేసరికి.. అతని స్నేహితుని కంటే ఎక్కువ అసలేం జరిగి ఉంటది అని లక్ష్మినారాయణలో ఆత్రుత పెరిగింది.. సరే ఏమయ్యుంటుందో అని ఆ పక్క ఒక చెవి వేసాడు. ఏముంది.. మా పెద్దమ్మ కూతురు ఇంట్లోంచి పారిపోయిందట! అని ఆ ఎరుపు చొక్కా యువకుడు తన స్నేహితునికి చెప్పగానే లక్ష్మినారాయణకి గుండెల్లో చిల్లు పడ్డంత పనైంది. దేవుడా...! నన్ను ఈ హోటల్ నుంచే తీసుకుపోయేట్టు ఉన్నావు కదయ్యా? అని దిగాలుతో తను తాగుతున్న లస్సి గ్లాస్ టేబుల్ మీద పెట్టాడు.

అరె మరి మీ పెద్దమ్మ వాళ్ళకు తెలువదా ఆమె విషయం అని పచ్చ చొక్కా అతను అడుగగానే, లక్ష్మినారాయణ మరింత ఆసక్తిగా వింటున్నాడు. అందరికి తెలుసురా..! ఈ విషయం మా అమ్మతో చెప్పి మా పెద్దమ్మని ఒప్పించుమని చెపితే, మా నాన్న పెదనాన్న ఇద్దరు కలిసి మా పరువు ప్రతిష్ట అంటూ పెద్ద క్లాసు పీకారు. అందరి అమ్మానాన్నలలాగే మా పెద్దనాన్నసెల్ ఫోన్ లాక్కున్నారు, కాలేజీ బంద్ అని చెప్పారు. ఇంకేముంది అమ్మలక్కలు అందరికి ఇదొక టైం పాస్ టాపిక్. ఈనోట ఆనోటా విన్న మా పెద్దనాన్న ఇంకా ఇలా అయితే లాభం లేదని చెప్పి పెళ్లి సంబంధాలు మొదలుపెట్టాడు. కొందరు అబ్బాయిల ఫోటోలు మా అక్కకు ఇచ్చి చూడుమన్నప్పుడు, ఇంకా ఇదే ఆఖరి అవకాశం అని మా పెద్దనాన్నతో ధైర్యంగా నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పింది. ఉగ్రహవేశంతో మా పెద్దనాన్న మా అక్క చెంప చెల్లుమనిపించి, కాళ్ళు ఇరగ్గొట్టి ఇంట్లో కుర్చేపెడత అని చెప్పి తనకు నచ్చిన సంబంధం ఖాయం చెయ్యడానికి వెళ్ళాడు. అక్క ఏడుపు చూడలేక, కనీసం మా ఇంట్లోనన్న కొంచెం మనసు మార్చుకుంటదేమో అని మా అమ్మ, నాన్న అక్కను మా ఇంటికి తీసుకొచ్చారు. మెల్లి మెల్లగా మా అక్క మనసు మారుతుందేమో అని ఎదురుచూసిన వాళ్ళందరికీ నిరాశే ఎదురైంది. ఏకంగా ఇవ్వాళ ఇంట్లోంచి బ్యూటీ పార్లర్ అని చెప్పి ఎటో వెళ్లిపోయింది. ఏముంది మంచిగా ప్లాన్ చేసుకొని మరి తప్పించుకొని ఉంటది...అని ముగించాడు.

అరేయ్... అలా అంటావెంటిరా? అంత ముద్దుగా పెద్దోళ్ళు చుసిన సంబంధాలు చేసుకోను అని చెప్పినాక కూడా వాళ్ళు వినిపించుకోకపోతే ఆమె ఇంకేం చేస్తుంది అని ఆ పచ్చ చొక్కా అతను అనగానే లక్ష్మినారాయణ కళ్ళు ఎర్రగా మారడం మొదలైంది. అరె మా అక్కకు ఎప్పుడు చూడు ఆమె గురించే పట్టించుకుంటది కానీ మా పెద్దనాన్న గౌరవం ఏమికావాలని ఒక్క-సారైనా ఆలోచించిందామా పెద్దనాన్న మంచి మంచి సంబంధాలు తీసుకొచ్చాడు, మంచి మంచి పేరున్న కుటుంబాలట, బాగా ఆస్తిపరులంట కుడా..!అది వినిపించుకోకుండా ఆమె మంకుపట్టు ఆమెనే..!అని బుసలుకోడుతూ ఎర్ర చొక్కా అతను చల్లారుతున్న టీని  తాగడం మొదలుపెట్టాడు. మనసులో లక్ష్మినారాయణకు ఆ ఎర్ర చొక్కా అతనిమీద విపరీతమైన అభిమానం ముంచుకొస్తుంది.

అరె సినిమాలు చూసి ఈ కాలం పిల్లలు చెడిపోతున్నారని పెద్దవాళ్ళు ఒకటే పాట పాడుతారు కానీ వాళ్ళు మాత్రం ఏం మాత్రం మారుతున్నారేంటి? ఇంకా చెప్పాలంటే కనీసం ఈ కాలం సినిమాలు చూసే మీ అక్క కనీసం ఆ పెళ్లి ఇష్టం లేదని ధైర్యంగా చెప్పగలిగింది. అరె అంత ధైర్యంగా ఆమె ఒక అబ్బాయి గురించి చెప్పడానికి ప్రయత్నిస్తున్నప్పుడు వినొచ్చు కదా? అదే పక్కింటి పార్వతమ్మ ఒక మోతుబారి సంబంధం తెస్తే ఆమెను ఒక దేవతలాగా చూసి లేని పోని మర్యాదలు చేసి మరి ఆమె చెప్పే సోదంత వింటారు. కానీ కన్న కూతురు తను ఇష్టపడ్డ అతని గురించి చెపితే మాత్రం వినరు! ఇక్కడ మీ అక్క చేసుకోవలనుకున్నోడు మీకు కొత్తే.. ఆ పార్వతమ్మ తెస్తున్న సంబంధం  కూడా కొత్తే. కాని పార్వతమ్మకు సకల మర్యాదలు, మీ అక్కకు మాత్రం చెంప దెబ్బలు.  ఇది ఏ సినిమాలు చూసి నేర్చుకుంటున్నారు పెద్దవాళ్ళు... అని ఉక్రోషంతో పచ్చ చొక్కా అతను చెప్తున్నాడు.
అప్పుడు ఎర్ర చొక్కా అతను, అరేయ్... పెద్ద వాళ్ళు అన్ని ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటారు. వాళ్ళ అనుభవం, ఆలోచనల ముంచు మనమెంత చెప్పు. ఇవన్ని చూస్తుంటే పాపం మా పెద్దనాన్న ఎలా బాధపడుతున్నాడో ..... అంటూ చెప్పసాగాడు. నేను ఒప్పుకుంట పెద్దవాళ్ళు అన్ని మన మంచికోరే చేస్తారు....ఒక్క పెళ్లి విషయంలో తప్ప! అసలు ఒక్కసారైనా మీ అక్క ఇష్టపడ్డ అతను ఎవరు, ఏం చేస్తున్నాడు అని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే మీ అక్క మనసు నొప్పించేవాళ్ళు కాదు కదా..!  అసలు అలా మీ అక్కకు గౌరవం ఇవ్వకుండ ఆమెకు సంబంధాలు చూస్తుంటే, ఆమె మాత్రం ఎలా మీ పెద్దనాన్నకు గౌరవం ఇస్తుందిఅని అంటూ ఆ పక్క చొక్కా అతను తన చల్లారిపోతున్న టీ కప్పును అందుకున్నాడు. 

సరే.. నువ్వన్నది కూడా నిజమే! కాని మా అక్కకు పెద్దవాళ్ళను ఒప్పించే ఓపికనే లేనప్పుడు, తను చేసుకున్న వాడితో అన్నింటిలో  ఓపికగా ఉంటుందని నమ్మకమేంటిఅని ఎర్రచొక్క అతను అంటే.. వెంటనే పచ్చ చొక్కా అతను, నమ్మకం అనేది చాలా పెద్దమాట! అది పెళ్లి చేసుకునేవాళ్ళలో ఉండాలి.. పెళ్లి చేసేవాళ్ళకు అవసరం లేదు. అసలు ఏ పెళ్ళిలో కూడా గ్యారంటీ లేదు.. అసలు ఇలాంటివి మన చేతిలో లేవు. అలాంటప్పుడు  మన చేతిలో ఉన్నవాటి గురించి ఆలోచించడం మంచిదే కదా! నాకు తెలిసి పెద్దవాళ్ళకు తన కూతురు ఇష్టపడ్డ విషయంపైన భయం కంటే ఎక్కువగా సమాజం వాళ్ళను ఎలా చూస్తుందనే భయం ఎక్కువగా ఉంది.  మనం సమాజంలో బ్రతుకుతున్నాము కాని, సమాజం కోసం బ్రతకట్లేదు. ఏ అమ్మాయి కానీ అబ్బాయి కానీ కావాలని తల్లిదండ్రులనుండి  పారిపోరు కదా! కేవలం వాళ్ళ పెళ్ళికి పెద్దవాళ్ళు ఒప్పుకోరని తెలిసాకే ఇలాంటి పనులు చేస్తారు కదా! సరే ఇంకోలా అనుకుందాం... ఒకవేళ నువ్వన్నట్టే పెద్దవాళ్ళను ఒప్పించడానికి ఇంకా కొద్దిరోజులు ఓపికపట్టాలి అని అంటావు... అసలు పెళ్లి పనులు ఏవి మొదలవకముందే మీ అక్క ఎంతో కొంత సంస్కారంతో, మీ పెద్దనాన్న పరువు గురించి ఆలోచించే  చెప్పుంటుంది. అదే అన్ని పెళ్లి పనులు పూర్తయ్యాక మీ అక్క తన విషయం చెపితే ఎలా ఉండేదో ఒకసారి ఆలోచించు! ఈ విషయం ముందే ఎందుకు చెప్పలేదని అందరు నిలదీస్తారు. అలాంటి సమయంలో ఇంట్లోంచి పారిపోతే నిజంగా అది ఆమె చేసే పెద్ద నేరమయ్యేది. కాని ఇంత మంచిగా మొదట్లోనే అన్ని చెపితే వీళ్ళకి సమస్య ఏంటో నాకైతే అర్థం కావట్లేదు.... అని పక్క చొక్కా అతను అనడంతో లక్ష్మినారాయణ హృదయం కిరాణాకొట్టు షావుకారి చేతిలో తూకంలాగ  తూగుతోంది. మెల్లిమెల్లగా తన కూతురువైపు నుంచి ఆలోచించడం మొదలుపెట్టాడు.

ఉఫ్.. ఉఫ్... మనకు క్లాసు టైం అవుతోంది.. ఓహ్హో ఏంటిరా మనం ఇలాంటి విషయాల్ని ఇలా చర్చించాం? అని నవ్వుకుంటూ ఇద్దరు యువకులు హోటల్ నుండి వెళ్లిపోతుంటే లక్ష్మినారాయణకు వాళ్ళిద్దరూ ముందు కనిపించినలాగ కాకుండా చాలా భాద్యతో కూడిన యువకులలా కనపడుతున్నారు. తనుకూడా తన లస్సి బిల్లు సర్వర్ చేతిలోపెట్టి హోటల్ నుండి ఇంటికి  బయలుదేరాడు.  వెనకట దేవుళ్ళు జనాలకు హితబోధ చేయడానికి మారువేషాల్లో వస్తారంటే ఇలాగేనేమో అని రామచంద్రునికి, ఆ యువకులకు మనసులోనే కృతజ్ఞతలు తెలుపుకుంటూ తన కూతురితో ఎలా మాట్లాడాలో ఆలోచించుకుంటూ ఇంటికి బయలుదేరి వెళ్తున్నాడు లక్ష్మినారాయణ.