Monday, April 19, 2010

నా కూతురి పెళ్లి ...!





మిట్ట మధ్యాహ్నం రెండు గంటలవుతుండగా వడి వడిగా లస్సి తాగుదామని ఒక హోటల్ లోకి అడుగుపెట్టాడు లక్ష్మినారాయణ. ఎండ తీవ్రత కన్నా ఎక్కువగా తన కూతురు అలా చెప్పిందేమిటనే  విషయమే అతన్ని లస్సి తాగేలా చేస్తుంది. తనని ఎలా పెంచాను, నా చేతుల్లో పెరిగిన అమ్మాయి ఇలా చేసిందేంటి? అసలు నేనేమన్నా తప్పు చేసానా? తనకు కోరినంత స్వేచ్చ ఇస్తే నాకు ఇచ్చే మర్యాద ఇదా? ఇలా మనసులో ఎన్నెన్నో ప్రశ్నలు అతన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే.. అప్పుడే సర్వర్ వచ్చి ఏం కావాలని అడుగుతుంటే.. ఈ లోకం లో వచ్చి పడ్డాడు లక్ష్మినారాయణ. ఒక లస్సి చాలు అని చెప్పగానే సర్వర్ అక్కడినుండి వెళ్ళిపోయాడు.

మళ్లీ లక్ష్మినారాయణ తన ఆలోచన లోకంలోకి అడుగుపెట్టాడు. అసలు నా పరువు ఏం కావాలి? నా ప్రతిష్ట ఏం కావాలి? అసలు నేను సమాజంలో ఎలా తలెత్తుకునేది? ఈ కాలం పిల్లలు అన్నింట్లో ఇంత ముందుకు పోతున్నారు అని అందరు అంటారే కానీ.. ఇంకా అందరు అలానే వంకరటింకరగా ఆలోచిస్తున్నారు,వక్ర మార్గాలు పడుతున్నారు. పెద్దల మీద గౌరవం రాను రాను మరీ తగ్గిపోతుంది... అసలు ఈ కాలం అబ్బాయిలు ఒక్కడన్నా తల్లిదండ్రుల గురించి ఆలోచిస్తాడాఆలోచిస్తే నా లాంటి తండ్రులకు ఈ లస్సి అవసరాలే ఉండవు. సార్..మీ లస్సి! అని సర్వర్ అనగానే మళ్ళీ ఈ లోకంలోకి వచ్చాడు లక్ష్మినారాయణ.

ఒక్క గుటక లస్సి తాగగానే కొంచెం మనశ్శాంతి దొరికిందిరా రామచంద్ర అని మనసులో అనుకుండగానే తన కళ్ళముందర ఇద్దరు యువకులు కనపడ్డారు. ఇలాంటి వాడెవడో అయ్యుంటాడు నా కూతురికి మాయ మాటలు చెప్పి తన మనసు మార్చి నన్ను ఇంత వేదనకు గురి చేస్తున్నారు అని అనుకుంటుండగానే వాళ్ళు తన వెనకాల ఉన్న బెంచిని ఆక్రమించారు. ఒకడు ఎరుపు చొక్కా ధరిస్తే ఇంకొకడు ఆకు పచ్చ రంగు చొక్కా ధరించాడు. ఇద్దరికిద్దరూ పనికిమాలిన వెదవల్లా ఉన్నారని మనసులో అనుకుంటూ కొద్దిక్కొద్దిగా లస్సి తాగుతున్నాడు. ఎరుపు చొక్కా యువకుని మొబైల్ ఫోన్ మోగగానే ఉలిక్కి పడి లోలోపల అందరిని తిట్టుకుంటున్నాడు. అసలే భయం భయం తో ఉన్న లక్ష్మినారాయణకి ప్రతీది వణుకుపుట్టిస్తుంది... ఆఖరుకు సెల్ ఫోన్ మోగిన చప్పుడు కూడా...

హలో, ఆహ్ అవునా?, దానికేమన్న పిచ్చా?, ఏం రోగమో?, సర్లే నేను వెళ్తానులే పెద్దమ్మ దగ్గరికి అని ఆ యువకుడు ఫోన్ పెట్టేసేసరికి.. అతని స్నేహితుని కంటే ఎక్కువ అసలేం జరిగి ఉంటది అని లక్ష్మినారాయణలో ఆత్రుత పెరిగింది.. సరే ఏమయ్యుంటుందో అని ఆ పక్క ఒక చెవి వేసాడు. ఏముంది.. మా పెద్దమ్మ కూతురు ఇంట్లోంచి పారిపోయిందట! అని ఆ ఎరుపు చొక్కా యువకుడు తన స్నేహితునికి చెప్పగానే లక్ష్మినారాయణకి గుండెల్లో చిల్లు పడ్డంత పనైంది. దేవుడా...! నన్ను ఈ హోటల్ నుంచే తీసుకుపోయేట్టు ఉన్నావు కదయ్యా? అని దిగాలుతో తను తాగుతున్న లస్సి గ్లాస్ టేబుల్ మీద పెట్టాడు.

అరె మరి మీ పెద్దమ్మ వాళ్ళకు తెలువదా ఆమె విషయం అని పచ్చ చొక్కా అతను అడుగగానే, లక్ష్మినారాయణ మరింత ఆసక్తిగా వింటున్నాడు. అందరికి తెలుసురా..! ఈ విషయం మా అమ్మతో చెప్పి మా పెద్దమ్మని ఒప్పించుమని చెపితే, మా నాన్న పెదనాన్న ఇద్దరు కలిసి మా పరువు ప్రతిష్ట అంటూ పెద్ద క్లాసు పీకారు. అందరి అమ్మానాన్నలలాగే మా పెద్దనాన్నసెల్ ఫోన్ లాక్కున్నారు, కాలేజీ బంద్ అని చెప్పారు. ఇంకేముంది అమ్మలక్కలు అందరికి ఇదొక టైం పాస్ టాపిక్. ఈనోట ఆనోటా విన్న మా పెద్దనాన్న ఇంకా ఇలా అయితే లాభం లేదని చెప్పి పెళ్లి సంబంధాలు మొదలుపెట్టాడు. కొందరు అబ్బాయిల ఫోటోలు మా అక్కకు ఇచ్చి చూడుమన్నప్పుడు, ఇంకా ఇదే ఆఖరి అవకాశం అని మా పెద్దనాన్నతో ధైర్యంగా నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పింది. ఉగ్రహవేశంతో మా పెద్దనాన్న మా అక్క చెంప చెల్లుమనిపించి, కాళ్ళు ఇరగ్గొట్టి ఇంట్లో కుర్చేపెడత అని చెప్పి తనకు నచ్చిన సంబంధం ఖాయం చెయ్యడానికి వెళ్ళాడు. అక్క ఏడుపు చూడలేక, కనీసం మా ఇంట్లోనన్న కొంచెం మనసు మార్చుకుంటదేమో అని మా అమ్మ, నాన్న అక్కను మా ఇంటికి తీసుకొచ్చారు. మెల్లి మెల్లగా మా అక్క మనసు మారుతుందేమో అని ఎదురుచూసిన వాళ్ళందరికీ నిరాశే ఎదురైంది. ఏకంగా ఇవ్వాళ ఇంట్లోంచి బ్యూటీ పార్లర్ అని చెప్పి ఎటో వెళ్లిపోయింది. ఏముంది మంచిగా ప్లాన్ చేసుకొని మరి తప్పించుకొని ఉంటది...అని ముగించాడు.

అరేయ్... అలా అంటావెంటిరా? అంత ముద్దుగా పెద్దోళ్ళు చుసిన సంబంధాలు చేసుకోను అని చెప్పినాక కూడా వాళ్ళు వినిపించుకోకపోతే ఆమె ఇంకేం చేస్తుంది అని ఆ పచ్చ చొక్కా అతను అనగానే లక్ష్మినారాయణ కళ్ళు ఎర్రగా మారడం మొదలైంది. అరె మా అక్కకు ఎప్పుడు చూడు ఆమె గురించే పట్టించుకుంటది కానీ మా పెద్దనాన్న గౌరవం ఏమికావాలని ఒక్క-సారైనా ఆలోచించిందామా పెద్దనాన్న మంచి మంచి సంబంధాలు తీసుకొచ్చాడు, మంచి మంచి పేరున్న కుటుంబాలట, బాగా ఆస్తిపరులంట కుడా..!అది వినిపించుకోకుండా ఆమె మంకుపట్టు ఆమెనే..!అని బుసలుకోడుతూ ఎర్ర చొక్కా అతను చల్లారుతున్న టీని  తాగడం మొదలుపెట్టాడు. మనసులో లక్ష్మినారాయణకు ఆ ఎర్ర చొక్కా అతనిమీద విపరీతమైన అభిమానం ముంచుకొస్తుంది.

అరె సినిమాలు చూసి ఈ కాలం పిల్లలు చెడిపోతున్నారని పెద్దవాళ్ళు ఒకటే పాట పాడుతారు కానీ వాళ్ళు మాత్రం ఏం మాత్రం మారుతున్నారేంటి? ఇంకా చెప్పాలంటే కనీసం ఈ కాలం సినిమాలు చూసే మీ అక్క కనీసం ఆ పెళ్లి ఇష్టం లేదని ధైర్యంగా చెప్పగలిగింది. అరె అంత ధైర్యంగా ఆమె ఒక అబ్బాయి గురించి చెప్పడానికి ప్రయత్నిస్తున్నప్పుడు వినొచ్చు కదా? అదే పక్కింటి పార్వతమ్మ ఒక మోతుబారి సంబంధం తెస్తే ఆమెను ఒక దేవతలాగా చూసి లేని పోని మర్యాదలు చేసి మరి ఆమె చెప్పే సోదంత వింటారు. కానీ కన్న కూతురు తను ఇష్టపడ్డ అతని గురించి చెపితే మాత్రం వినరు! ఇక్కడ మీ అక్క చేసుకోవలనుకున్నోడు మీకు కొత్తే.. ఆ పార్వతమ్మ తెస్తున్న సంబంధం  కూడా కొత్తే. కాని పార్వతమ్మకు సకల మర్యాదలు, మీ అక్కకు మాత్రం చెంప దెబ్బలు.  ఇది ఏ సినిమాలు చూసి నేర్చుకుంటున్నారు పెద్దవాళ్ళు... అని ఉక్రోషంతో పచ్చ చొక్కా అతను చెప్తున్నాడు.
అప్పుడు ఎర్ర చొక్కా అతను, అరేయ్... పెద్ద వాళ్ళు అన్ని ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటారు. వాళ్ళ అనుభవం, ఆలోచనల ముంచు మనమెంత చెప్పు. ఇవన్ని చూస్తుంటే పాపం మా పెద్దనాన్న ఎలా బాధపడుతున్నాడో ..... అంటూ చెప్పసాగాడు. నేను ఒప్పుకుంట పెద్దవాళ్ళు అన్ని మన మంచికోరే చేస్తారు....ఒక్క పెళ్లి విషయంలో తప్ప! అసలు ఒక్కసారైనా మీ అక్క ఇష్టపడ్డ అతను ఎవరు, ఏం చేస్తున్నాడు అని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే మీ అక్క మనసు నొప్పించేవాళ్ళు కాదు కదా..!  అసలు అలా మీ అక్కకు గౌరవం ఇవ్వకుండ ఆమెకు సంబంధాలు చూస్తుంటే, ఆమె మాత్రం ఎలా మీ పెద్దనాన్నకు గౌరవం ఇస్తుందిఅని అంటూ ఆ పక్క చొక్కా అతను తన చల్లారిపోతున్న టీ కప్పును అందుకున్నాడు. 

సరే.. నువ్వన్నది కూడా నిజమే! కాని మా అక్కకు పెద్దవాళ్ళను ఒప్పించే ఓపికనే లేనప్పుడు, తను చేసుకున్న వాడితో అన్నింటిలో  ఓపికగా ఉంటుందని నమ్మకమేంటిఅని ఎర్రచొక్క అతను అంటే.. వెంటనే పచ్చ చొక్కా అతను, నమ్మకం అనేది చాలా పెద్దమాట! అది పెళ్లి చేసుకునేవాళ్ళలో ఉండాలి.. పెళ్లి చేసేవాళ్ళకు అవసరం లేదు. అసలు ఏ పెళ్ళిలో కూడా గ్యారంటీ లేదు.. అసలు ఇలాంటివి మన చేతిలో లేవు. అలాంటప్పుడు  మన చేతిలో ఉన్నవాటి గురించి ఆలోచించడం మంచిదే కదా! నాకు తెలిసి పెద్దవాళ్ళకు తన కూతురు ఇష్టపడ్డ విషయంపైన భయం కంటే ఎక్కువగా సమాజం వాళ్ళను ఎలా చూస్తుందనే భయం ఎక్కువగా ఉంది.  మనం సమాజంలో బ్రతుకుతున్నాము కాని, సమాజం కోసం బ్రతకట్లేదు. ఏ అమ్మాయి కానీ అబ్బాయి కానీ కావాలని తల్లిదండ్రులనుండి  పారిపోరు కదా! కేవలం వాళ్ళ పెళ్ళికి పెద్దవాళ్ళు ఒప్పుకోరని తెలిసాకే ఇలాంటి పనులు చేస్తారు కదా! సరే ఇంకోలా అనుకుందాం... ఒకవేళ నువ్వన్నట్టే పెద్దవాళ్ళను ఒప్పించడానికి ఇంకా కొద్దిరోజులు ఓపికపట్టాలి అని అంటావు... అసలు పెళ్లి పనులు ఏవి మొదలవకముందే మీ అక్క ఎంతో కొంత సంస్కారంతో, మీ పెద్దనాన్న పరువు గురించి ఆలోచించే  చెప్పుంటుంది. అదే అన్ని పెళ్లి పనులు పూర్తయ్యాక మీ అక్క తన విషయం చెపితే ఎలా ఉండేదో ఒకసారి ఆలోచించు! ఈ విషయం ముందే ఎందుకు చెప్పలేదని అందరు నిలదీస్తారు. అలాంటి సమయంలో ఇంట్లోంచి పారిపోతే నిజంగా అది ఆమె చేసే పెద్ద నేరమయ్యేది. కాని ఇంత మంచిగా మొదట్లోనే అన్ని చెపితే వీళ్ళకి సమస్య ఏంటో నాకైతే అర్థం కావట్లేదు.... అని పక్క చొక్కా అతను అనడంతో లక్ష్మినారాయణ హృదయం కిరాణాకొట్టు షావుకారి చేతిలో తూకంలాగ  తూగుతోంది. మెల్లిమెల్లగా తన కూతురువైపు నుంచి ఆలోచించడం మొదలుపెట్టాడు.

ఉఫ్.. ఉఫ్... మనకు క్లాసు టైం అవుతోంది.. ఓహ్హో ఏంటిరా మనం ఇలాంటి విషయాల్ని ఇలా చర్చించాం? అని నవ్వుకుంటూ ఇద్దరు యువకులు హోటల్ నుండి వెళ్లిపోతుంటే లక్ష్మినారాయణకు వాళ్ళిద్దరూ ముందు కనిపించినలాగ కాకుండా చాలా భాద్యతో కూడిన యువకులలా కనపడుతున్నారు. తనుకూడా తన లస్సి బిల్లు సర్వర్ చేతిలోపెట్టి హోటల్ నుండి ఇంటికి  బయలుదేరాడు.  వెనకట దేవుళ్ళు జనాలకు హితబోధ చేయడానికి మారువేషాల్లో వస్తారంటే ఇలాగేనేమో అని రామచంద్రునికి, ఆ యువకులకు మనసులోనే కృతజ్ఞతలు తెలుపుకుంటూ తన కూతురితో ఎలా మాట్లాడాలో ఆలోచించుకుంటూ ఇంటికి బయలుదేరి వెళ్తున్నాడు లక్ష్మినారాయణ.

3 comments:

Arjun (Always Learning) said...

you write good novel kind of writings.I mean explaining them lively. Continue to write with more new ideas.

మధురవాణి said...

బాగుందండీ కథ.. realisitc గా ఉంది మీరెంచుకున్న టాపిక్! కానీ, నాదో సందేహం.. అలా ఇద్దరు మాట్లాడుకున్నది పది నిమిషాలు విన్నంత మాత్రాన వాళ్ళలో బలంగా నాటుకుపోయిన అభిప్రాయాలు మారతాయంటారా? నాకైతే అనుమానమే! ;-)

Madarapu said...

మీరు సూపరండి... ;-)
నేనూ ఒక చిన్న ట్విస్ట్ ఇచ్చాను చివరలో....ఇవ్వాలని ఇవ్వలేదనుకోండి కానీ ఏదో అలా ... :-)
లక్ష్మినారాయణ పాతకాలం మనిషి లేదా అతనిలో సొంత అభిప్రాయాలు బలంగా నాటుకున్నాయి అని మీరే అంటున్నారు కాబట్టి... అలాంటి వాళ్ళకి దైవ భక్తి కూడా కొంచెం ఎక్కువనే ఉంటుంది అని అనుకొని అతడు మొదటగా ఆ యువకులని దేవుడు పంపిన మనుషుల్లాగా అభిప్రాయ పడుతాడు. అలాంటి మనిషికి దేవుడి కంటే అతని అభిప్రాయాలు ఏం పెద్దగా కనిపించవు..
అంతే కాకుండా.. లక్ష్మినారాయణ తన కూతురితో ఎలా మాట్లాడాలో ఆలోచించుకుంటూ వెళ్తున్నాడు... అతను ఒప్పుకుంటాడా ఒప్పుకోడా అనేది ఆ తండ్రీకూతుళ్ళ మధ్య జరగబోయే సంభాషణ మీద ఆధారపడి ఉంటుంది.
ఇవన్ని పక్కన పెడితే నా కథయొక్క ముఖ్య ఉద్దేశ్యం తల్లితండ్రులని (పెద్దల్ని) తన కూతురు/కొడుకు ఇష్టపడ్డ వాళ్ళ గురించి ఒక్క క్షణం ఆలోచించమని...! ఈ కథలో చెప్పినట్టు.. పక్కింటి పార్వతమ్మ ఒక సంబంధం తెస్తే ఆమెకి ఎప్పుడు చేయని మర్యాదలు చేసి మరీ ఆమె సోది వింటారు... వాళ్ళు తెచ్చే సంబంధాల్లో శ్రీరామ చంద్రులు మాత్రమే ఉంటారని గ్యారంటీ లేదు.. పెద్దవాళ్ళు ఆలోచించే విధానాన్ని కొంచెం సరళీకృతం చెయ్యాలని భావించి ఈ కథ రాసాను..
చివరగా.... వరుడు సినిమా పాటల ఆవిష్కరణ సందర్భంగా ప్రముఖ సిని నిర్మాత సురేష్ బాబును మీకు ప్రేమ వివాహం ఇష్టమా? పెద్ద కుదిర్చిన వివాహం ఇష్టమా? అన్న ప్రశ్నకు బదులుగా, నాకు విజయంతమైన వివాహం అంటే ఇష్టం అన్నాడు. అందులో ఎంత అర్థం ఉంది...
ఈ సమాధానం మిమ్మల్ని త్రుప్తిపరచకపోతే, మరింత వివరంగా చర్చించడానికి సుముఖంగా ఉన్నాను..
భవదీయ
రాము మాదారపు

Post a Comment