లోకంలో ప్రతి మనిషికి డబ్బు అవసరం. డబ్బు సంపాదించడానికి ఉద్యోగం అవసరం. కొందరు నచ్చిన ఉద్యోగం కోసం ఎన్ని రోజులైన వేచిచూస్తారు, మరికొందరు డబ్బుకోసం రాజీపడి దొరికిన ఉద్యోగంలో చేరతారు. నేను లండన్ విశ్వవిద్యాలయంలో చదువుకుంటున్నప్పుడు చాలా మంది విద్యార్థులు చాలా ఉద్యోగాలు చేస్తూ చాలా డబ్బులు సంపాదించేవారు. ఒకప్పుడు నేను కూడా అందుకు అతీతున్నేం కాదు. కాని మెల్లిమెల్లిగా నన్ను నేను పూర్తిగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. డబ్బు మీద ఆశ తగ్గి జ్ఞాణార్జన మీద ఆలోచనలు పెరిగాయి. ప్రతిరోజు ఎంతో కొంత నేర్చుకున్నానా? లేదా? అనేది మాత్రమే సరిచూసుకునేది.
అప్పుడప్పుడు నా తోటి విద్యార్థులు నన్ను యక్ష ప్రశ్నలు వేసేవారు. అందులో ఎక్కువగా నా వ్యక్తిగత జీవితానికి సంబంధించినవే ఉండేవి. చాలా మందికి నేను చేస్తున్న ఉద్యోగం బాగా నచ్చేది. వాళ్ళు నా విధులేంటో చాలా సార్లు అడిగేవారు. నా విధులను వాళ్ళు చాలా పొగిడేవారు కూడా! నేను నా పనులేం అంత గొప్పేం కాదు కదా అని నన్ను నేను సమర్దించుకోనేవాన్ని. ఎప్పుడు చూసినా వాళ్ళు ఎంతో కొంత నేర్చుకుంటున్నావు కదా! మాకు నేర్చుకోవడానికి ఏం లేదు అంటూ దిగాలు చెందేవారు. వాళ్ళ విధులేమిటో అప్పుడప్పుడు చెప్పేవారు. గమ్మత్తేంటంటే వాళ్ళ విధులు నాకు బాగా నచ్చేవి కానీ వాళ్ళకు ఎంత మాత్రం నచ్చకపోయేవి. బాగానే ఉన్నాయి కదా మీ విధులు కూడా, నేర్చుకోవడానికి కూడా అవకాశం బాగానే ఉంది కదా అని అనగానే, వాళ్ళు అదీ ఇదీ బుకాయిస్తూ వెళ్ళిపోయేవారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత చాలా సార్లు నేను అంతర్మధనం చేసేవాడిని. అసలు ఎవరి ఉద్యోగం వారికి ఎందుకు నచ్చదు. పక్కవాళ్ళ ఉద్యోగం ఎందుకు అంతగా నచ్చుతుంది అని? ఎన్ని సార్లు ఆలోచించినా గాని, నాకు తెలిసింది ఒక్కటే. సొంతింటి కోడికూర పప్పుతో సమానం - పొరిగింటి పప్పుకూర పరమాన్నంతో సమానం అన్నట్టు, మనం చెయ్యాల్సిన విధులు, మనం చేస్తున్న విదులేప్పుడు మనకు బరువుగానే అనిపిస్తాయి, పక్కనోడి విదులేప్పుడూ సులువుగానే కనిపిస్తాయి. మనం పక్కవాడి విధులను ఏ కళ్ళతో చూస్తున్నామో, ఏ విధంగా చూస్తున్నామో, అదే కళ్ళతో, అదే విధంగా మన విధులను చూస్తే మనం చెయ్యాల్సిన విధులు, చేస్తున్న విధులు సులువుగానే కనిపిస్తాయి.
మరి ఆలస్యమెందుకు? ఒక్కసారి కళ్ళుమూసుకొని మీ పనులని మీరు పక్కవాళ్ళ పనులని ఏ కళ్ళతో చూస్తారో అదే కళ్ళతో చూడడానికి ప్రయత్నం చేయండి.... పరిష్కారం లభిస్తుంది.
0 comments:
Post a Comment